Saturday, November 19, 2011

ఆడపిల్ల..

ఆడపిల్ల..

ఇది నా తప్పా...అమ్మా...నీకు నేనొద్దా నాన్నా...
నేను కూడ నీనుంచే వచ్చానే.....
నువ్ కూడ నాలాంటి ఆడదాని కొడుకువే....
అమ్మ లేనిదే జన్మ ఉన్నదా....
మరి ఆ అమ్మ కూడా ఆడదే కదా...

ఆదరించే ఆలి లేదా..ఆదుకొనే నాధుడెవడు
మగడి పొగరు మోయడానికి..మగువ లేదా..మనుగడేది..
పొత్తిళ్ళలో పసిగుడ్డును..కసిదీరా నలిపేసి
తరతరాల వారధిని..తనువు చాలింపజేసి..
కాలరాయకు నా తలరాతని...
విసిరికొట్టకు నాన్నా.. ఈ కూతురుని...||ఇది నా తప్పా..||

బిడ్డంటే బాబేనా..మనిషంటే మగడేనా...
ఆడది లేనిది ఇల్లేనా...ఆదిలక్ష్మి ఆలి పై కినుకేనా..
కంచంలో అన్నమై, బంధంలో చెల్లినై..
బతుకులోన భార్యనై..బతుకుకై అమ్మనై..
మురిపించి మరపించి తరింపజేసే
ముద్దులొలికే ముదితను...మట్టుపెడతావా... ||ఇది నా తప్పా||

వేల యణువుల మగడి ధారలో..దారి చేసుకు పరుగు తీసి
అలసిసొలసి అమ్మ కడుపులో ఆదమరచి కునుకు తీసి
అందమైన లోకంకై కమ్మనైన కలలు చూసి..
కనులుతెరిచే వేళ నను తునకలు చేస్తావా..
ఇంటికొచ్చే ఇంతిమొగ్గను తుంచివేస్తావా...
వెలుగునిచ్చే ఇంటి దీపం ఆర్పివేస్తావా...||ఇది నా తప్పా||

Tuesday, September 20, 2011

కొత్త నానోలు......

ప్రణయం
ప్రళయం
ఒక్కటే
ఆడది

పద్మవ్యూహం
అభిమన్యుడు
ట్రాఫిక్
సామాన్యుడు

రోడ్లు
నరకానికా
స్వర్గానికా
గమ్యానికా

ఏటీయం
నాకు
నాన్న
జేబు

కిరీటం
ఉండాల్సిందే
వంకాయ
కదా...
నానోల్లో
నేను
మరీ
నానో...
భావం
మెగా
రూపం
నానో

కళాశాల
నేడు
చదువుల
కబేళా..

మార్కులు
వంద
జ్ఞానం
సున్నా

నీడపై
కోపం
నీతోనే
ఉంటుందని...

ఫేస్ బుక్
చెట్టు
కింద
నానోదయం
మామిళ్ళు
ముంజెలు
ఈతలు
వేసవి

సెలవులు
ఆటలు
ప్రయాణాలు
వేసవి

తాతయ్య
ఇచ్చిన
డబ్బులు
వేసవి

నానమ్మ
పెట్టిన
మురుకులు
వేసవి

తలంటిన
అత్తమ్మ
వాల్చూపు
మరదలు

అద్దె
సైకిల్
పగిలిన
మోచిప్ప

బావతో
పందేలు
నాన్న
మొట్టికాయలు

మేడపై
వెన్నెల్లో
అత్తమ్మ
గోరుముద్దలు....

Friday, September 16, 2011

తాళాలగుత్తి.....

సాకీ:
గల గల చప్పుడు..తళ తళ మెరుపులు..
అరచేతిలో భద్రం..భద్రత మొత్తం
ఏవిటో చెప్పు...?
.....................
ఇంకేవిటీ...తాళాలగుత్తి.....
ఇది పోయిందా...నువ్ గో....విందా.....

పల్లవి:
మేను మెరుపులతో ఆకర్షిస్తావు...
మనుషులకు నువ్ మత్తెక్కిస్తావు..
లోహ రూపమునున్న లోభివి నువ్వు..
లోకమంతటిని దాసుని కావించావు..

చరణాలు:
ప్రాణం లేని తుక్కువే..ఐనా..మా ప్రాణాలన్నీ నీవే...
వేళ గాని వేళ వేధిస్తావ్..చిక్కక...
వెతికి వెతికి చూడ..విసుగొచ్చేదాకా...
ఎంత గర్వం నాకు..
నిన్నలా వేలికి పెట్టి తిప్ప...
పట్టుజారి నా పరువు తీయకు సుమా...||మేను మెరుపులతో||

అధికార ప్రతిరూపానివే..అత్తగారి అభరణానివే...
కోడలమ్మ కోరిక పై..
కొంగులోన మురిసేదెన్నడమ్మా...
వేలెడంత లేకున్నా..వేన వేలు దాస్తావు...
గుడి కానీయ్... బడి కానియ్..విలువలేనిదెక్కడ...
దేవుడికే..నువ్ కావలి...అందుకే మాక్కూడా కావాలి... ||మేను మెరుపులతో||

ఊరంత డోరైనా..నీ సైగ ఉండాలి...
నీవు లేక మేం తెరవ తరమా...
విర్రవీగిపోకుమా..నీకంత లేదులే..మా చోర..
ఘనుల ముందు నువ్ దిగదుడుపే...
ఇదిగో చెబుతున్న...వత్తి వత్తి...
పొగరు తగ్గించుకోవే..తాళాలగుత్తీ..||మేను మెరుపులతో||

Tuesday, September 13, 2011

లాలిపాట ......

ఆటలింక చాలు కన్నా..ఆగడాలు మాను నాన్నా..
అల్లిబిల్లి ఊసులతో..అలసిపోయే..తమరెంతో...
ఆదమరచి నిదురపోయె..వేళ కూడ దాటిపోయే...
అలసిన కిట్టయ్యకు నాన్న గుండె పానుపాయే...

తప్పటడుగులేస్తే తప్పుకాదురా చిన్నా..
తప్పుటడుగేసావో...చిన్నబోవు మీ నాన్న..
కొండంత ఎదగాలి....కోరుకుంది పొందాలి..
రాబోయే..కాలానికి రాజు నువ్వే కావాలి...
అందాకా నువ్ అన్నీ నేర్చాలి..అమ్మ గన్న కలలను నెరవేర్చాలి..||ఆటలింక||

ఇల్లు పీకి పందిరేసి.. బోసి నవ్వు రువ్వేవు..
ఉరిమి చూడ..పరుగు తీసి అమ్మ చాటు చేరేవు...
వద్దురా చిన్ని తండ్రీ ..పడుకో పద ఇంక...
పాడుకళ్ళు పడకుండా..బజ్జో నా వెనుక...
పాలబుగ్గల పసివాడా...వెన్నెలమ్మ నీ తోడా..నిదురపో నా నాన్నా నిదురపోరా...||ఆటలింక||

పసిపాదాలతో...పావనమే నా ఇల్లు...
వసివాడని నవ్వులతో..స్వర్గమిలా చాలు...
లోకం తీరు చూసావా..నరక కూపాలు...
అందుకో అమ్మకొంగు అభయహస్తాలు..
హాయిగా నిదురపో..కమ్మనైన కలలతో..ఆశిస్సులు నీకు... వర్ధిల్లు వెయ్యేళ్ళు...||ఆటలింక||

Monday, September 12, 2011

ప్రేమ లేని ప్రేమగీతం ......

సాకీ:
నీ అడుగుల సడి వినగానే నా..గుండె సవ్వడి...హెచ్చింది ..
నీ తలపు రాగానే..మది తలుపు తెరుచుకుంది..
ఓ మగువా..నా..మనసు మాటలు వినవా.....

పల్లవి:
వేయి జన్మలైనా..వేచి చూస్తా ప్రియా..
వేలందుకుని నడిపించగా నడిచొస్తా...సఖీ..
విధినైనా..విదిలిస్తా.. నిను చేరే దారిలో..
వేరు కాదు మనం జన్మ జన్మలలో ......

చరణాలు:
అనంతమైన అందమా..అందుకోమ్మా..
అంతులేని ఆరాటమా..నా అంతరంగమా..
అర్ధం చేసుకోమ్మా...ఆదరించుమా..
ఆవిరైన మాటల్లొ..అంతరార్ధమా..
ఆశలన్ని మూటగట్టి..ఆడుకోకుమా...
ఇదేమిటమ్మా..నీ మహిమా,..నాకు నేనే చిక్కనమ్మా.. ||వేయి జన్మలైనా||

నువ్వే నువ్వే నా..మది గెలిచావే...
నీ తలపుల జడిలో నను తడిపావే..
నా గుండె గుడిలో...అడుగేయవే..
కడదాకా..కలసి నీతో.. సాగనీయవే...
ఒక్కసారి ఊ కొట్టు..
నిను చేరాలని చెలరేగే నా మనసుని.. నీ చేత్తో...జోకొట్టు...||వేయి జన్మలైనా||

ఆకాశమంతటి మనుసు నాదిలే..
అందులోన నీ రూపు హరివిల్లు కాదులె..
ఆద్యంతం నీవే.. నా ఉదయ భానువే...
నా హృదయరాణివే..విరించి వరానివే...
వరించి నిలుపుకోవే..నా ప్రాణము నీవే...
చలించి..చూడు చెలీ వడివడి.....నా..యదలో ఈ అలజడి... ||వేయి జన్మలైనా||

నువ్ ఔనంటే చాలు ఆనందభాష్పాలు..
కాదంటె కొమ్మ..కన్నీటి వరదలు..
కళ్ళలోన కొలువున్నీ వదనం చూడు..
కాటికేగు నేను..కాదను నేడు..
కాలదోషమేది.. కపటిని కాను..
కావ్యమంటి నిన్ను....కంటి పాపలా..కాచుకొందును...||వేయి జన్మలైనా||

Sunday, September 11, 2011

నానోలు......

విజయం
మజిలీ
ఆపకు
ప్రయాణం

సిగరెట్
మద్యం
ఫేస్ బుక్
వ్యసనాలు

అన్నీ
విను
నచ్చింది
చెయ్

పుష్పకవిమానం
కాలేజిలో
నా
బైక్

ప్రతి
రోజు
హాజరు
థియేటర్లో
 
మనసు
చెడ్డది
మాట
వినదు

కన్నీటికి
టిష్యూ
పేపర్
కాలం

అగ్ని
కంటే
పవిత్రం
సీతమ్మ

గ్రౌండ్లో..
ఎదురీత..
ఇంగ్లాండ్లో
టీమిండియా

స్వరం
వరం
ఘనం
బాలు..

Thursday, September 08, 2011

నానోలు....

ఆకలి
లేదు
అమ్మ
ఉంది

త్వరణం
తరుణం
మరణం
శిరస్త్రాణం

నా
అరచేతిలో
చందమామ
గోరింటాకు

ఎర్రటి
అమృతం
జాడీలో
ఆవకాయ్

చెత్తబుట్ట
నిండిపోయింది
కుదర్లే
ప్రేమలేఖ..

Tuesday, September 06, 2011

నానోలు...

మానవమృగం
మృగం
పరువు
పోయింది

మనసు
మెదడు
భిన్న
ధ్రువాలు

అమ్మ
నాన్న
ఒక్కరిలో
అన్నయ్య

అసత్యం
వధ
"గాలి"
చెర

విద్య
వినయం
సంస్కారం
ఆభరణాలు

Monday, September 05, 2011

యవ్వనాల కోనలో.....

యవ్వనాల కోనలో
జారుతున్న జలపాతం నీసోయగం
పొంగుతున్న అందాలే
అందుకుంటే ఆనందం నాజన్మధన్యం -
నీ వయసే- కాపుకొచ్చెలే..మ్మా
నీ మనసే- నాకు ఇచ్చిపో..మ్మా

నిను ముద్దాడ ముందుకొచ్చే..ముద్దబంతులే..
నిన్ను తాకి మురిసిపోగ..నేల రాలే చినుకులే..
నీ వెలుగు చూసి తెల్లబోయే..వెన్నెలమ్మ నేడే..
అందీ అందని అందమా నిను చేరే భాగ్యమెపుడే ..
అందనంత దూరమా...ఆగడాలు చాలుమా..అందుకోవే నా ప్రేమ....||యవ్వనాల కోనలో||

నీ పసిడి సింగారం చూసి తలవంచే...బంగారమే....
నీ పరవళ్ళు గని చిన్నబోయెను...సెలయేరే...
నీ కనులు చూసి కన్నుమూసే...కలువలే...
మరి అన్ని సోయగాలు ఒక్కచోట కూడితే.....
మనసుని ఆపతరమా... నీ దరి చేరే దారి తెలుపుమా...ఓ ముద్దు గుమ్మా..||యవ్వనాల కోనలో||

మువ్వల పట్టీలతో...నాన్న గారాల పట్టివే...
అమ్మ గోరుముద్దతో..అచ్చమైన పాపవే...
నట్టింట నడయాడు నువ్..మహాలక్ష్మివే..
ఇహ తాళలేనే..నా హృదయ రాణి నీవే...
గుండెలోన గుడి కట్టా ...అడుగుపెట్టి నా మనసు నైవేద్యం ఆరగించవే....||యవ్వనాల కోనలో||

గమనిక: ఈ పాటలోని పల్లవిని రచించింది శ్రీనివాస రెడ్డి గారు...

Sunday, September 04, 2011

ఉపాధ్యాయుల దినోత్సవం..

కనిపించే
మూడో
దైవం
గురువు

అమ్మ
ఒడి
మొదటి
బడి

జ్ఞానం
ఆకలి
గురువు
భోజనం
__అందరికీ..ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు...

Tuesday, August 30, 2011

నానోలు..

అనుమానం
మేకు
అనుబంధం
బ్రేకు...


ఎలక్ట్రానిక్
వల
మాయాజాలం
అంతర్జాలం


అద్దె
ఇల్లు
దేహం
ఆత్మకు


ఆలస్యం
అమృతం
విషం
శుభరాత్రి..


కోపమా..
బుసలు
కొడుతుంది
వాలుజడ....


కోపం
దుఃఖ్ఖానికి
దగ్గర
దారి...

Saturday, August 27, 2011

తెలుగు ...

అజంతం
అమృతం
అద్వితీయం
తెలుగు

-ఆగస్ట్ 29 న తెలుగు భాషాదినోత్సవం....

ఆకలి ...

ఆకలి
ఆక్రందన
అన్నార్తుల
ఆవేదన

నానో

పిట్ట
కొంచెం
నానొ
ఘనం

Friday, August 26, 2011

బాష్పాంజలి...

సరే...చచ్చిపోయావ్...
ఏం సాధించావ్ ఇపుడు...
కోరుకున్నది పొందగలిగావా...
లేదు...
పొందింది పనికొచ్చిందా...
లేదు..
ఆత్మహత్య అని నువ్వు అనుకుంటున్నావ్...
హత్య చేసావని నేనంటాను....
ఔను ....
నీపై మా ఆశల్ని హత్య చేసావ్..
మా నమ్మకాన్ని హత్య చేసావ్..
మనమంతా ఎప్పుడూ కలిసుండాలిరా ...
అని చెప్పి..నీమటుకు నువ్ అదృశ్యమైపోయావ్ ....
బాధ్యత లేదా నీకు...
బాధనిపించలేదా నీకు...
ఎలా భరించావ్ రా..
అసలు... చావే చివరి మజిలీ ..
నీకు చచ్చేంత ధైర్యం ఉన్నప్పుడు...
ఒక్కసారి ఆ ధైర్యంతో ముందడుగేయాల్సింది...
బావా అని పిలిచి ...బంధం తో ముడేసావ్...
నిన్ను తల్చుకుంటే బాధ కాదు.. కోపమొస్తుంది...
స్నేహమనే మన పుస్తకం లోంచి ..
నీ పేజీ ని చించుకువెళ్ళిపోయావ్..
కానీ.. ఒరేయ్...
మా పేజిల్లో నీ జ్ఞాపకాల సంతకాలు  అలానే ఉన్నాయిరా...
బావా.. అమ్మ పిలుస్తుంది...ఒక్కసారి.. రారా.....


--తిరిగిరాని లోకాలకు తరలిపోయిన నా మిత్రునికి అశ్రునయనాలతో...... 

శుభోదయం..

తెల్లవారిన
కలలు
మళ్ళీ
శుభోదయం

ఆత్మహత్య...

క్షణికం
ఆవేశం
అనర్ధం
ఆత్మహత్య...

నిజం

నిజం
నిప్పు
చుట్టాలు
దాగవు..

ప్రభుత్వం

వర్షంలో
దున్నపోతు
దేశంలో
ప్రభుత్వం

Sunday, August 21, 2011

జెండా పండుగ....

వచ్చిందోయ్ వచ్చింది జెండా పండుగ..
తెచ్చిందోయ్ తెచ్చింది వేడుక నిండుగ..

ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం.. నీ స్వతంత్రం...  
నేల రాలిన వేల వీరుల రక్త తిలకం.. నీ స్వతంత్రం...
అహింసనెడి ఆయుధం తో సాధించెనీ స్వతంత్రం...
ఐకమత్యమే ఆయువుగా..
ఆత్మ బలమే వాయువుగా ...
ఆత్మ గౌరవం సాక్షిగా ...
నిలచి గెలిచినదీ స్వతంత్రం... ||వచ్చిందోయ్ ||


స్వాతంత్ర్యమొచ్చి అరవైనాలుగు ఏళ్ళు ...
నేటి నేతలకు తెలుసు అన్ని కళలు..

గనులు మింగిన ఘనులు వీరు..
పనులకై పర్సెంటు కోరు..
అవినీతి సాగర చక్రవర్తులు.. 
కుంభకోణముల తీరు చూడు..
నల్ల ధనమును లెక్క చూడు
ఆగిపోవు నీ గుండె నేడు..||వచ్చిందోయ్||


స్వాతంత్ర్యమొచ్చి అరవైనాలుగు ఏళ్ళు ...
నేటి జనులకు  అన్నింట కడగళ్ళు..

పేదవాడి ఇంట గంజి కూడు లేదు...
పెద్దవాడి ఇంట బెంజి కారు..
చదువు కొనెడి నేటి పరిస్థితులు 
మారునా బడుగు జీవి గతులు..
ఓట్లకై నోట్లు పంచేరు...
చివరికి నట్టేట నిను ముంచేరు ||వచ్చిందోయ్||

స్వాతంత్ర్యమొచ్చి అరవైనాలుగు ఏళ్ళు ...
నేటికైనా నువ్ తెరువు కళ్ళు..

మంచి నేతను ఎంచి చూడు ..
సంకుచితమును విడనాడు..
కూడు పెట్టని కులాలెందుకు..
మంటపెట్టే మతాలెందుకు..
పొరుగు వారితొ పోరు ఎందుకు ..
కలసి కట్టుగ కదులు ముందుకు..||వచ్చిందోయ్||

ఇది మహాభారతం కాదు..జనభారతం..
నూరు కోట్ల ప్రజల..ఏకతా రాగం 
నవలోక నిర్మాణానికి..నాంది పలికే తరుణం..
పంద్రాగస్టు వేళ పలికెను.. ప్రతి హృదయం
వందేమాతరం  వందే..మాతరం... ||వచ్చిందోయ్||

ఎన్నడు లేదే ఇలా నాలో...

ఎన్నడు లేదే ఇలా నాలో..
ఏదో అలజడి లోలో..
ఏంచేసావ్ అసలు ఇంతలో...
నను ముంచేసావే నీ ప్రేమలో..

ఉదయాన లేస్తూనే..
పుస్తకాల తో కుస్తీ విడిచి...
నన్ను నేనే మరచి...నీ ఊసే తలచి..
నీకొరకై తరచి,,అన్ని చోట్లా వేచి ..
నువ్ కనిపించగ..తరించిపొయానే...
నీకై తపించి పోయానే...
నీ నామం జపిస్తు ఉన్నానే,,||ఎన్నడు లేదే..||

మధ్యానమౌతూనే...
మనస్సంతా నువ్వేనే ..ఆకలినే మరచానే ..
నీ వెంటే నడిచానే..
ఆ ఎర్రటి ఎండే …వెండి వెన్నెలే నీ వల్లే..
పిల్లా నాతో రావే..ఇంక వేధించకే ...
చిన్ని పాదాలతో  నా మనసుని తొక్కేయకే..
నన్ను నట్టేట ముంచేయకే ....||ఎన్నడు లేదే..||

సాయంత్రపు వేళల్లో...
స్నేహితులను వదిలేసా..సెంటు కొట్టుకుని ఒచ్చెసా..
నీ కోసం వెతికేసా...
అదిగో ఆ క్షణం ..నీ ఐమూల చూపు
సమూలంగా నన్ను మాపింది రూపు ..
నాలో సెగ కి ఏది ఓదార్పు
దానికి టానిక్ నీ వలపు..||ఎన్నడు లేదే..||

నిశిరాతిరి సమయానా...
కునుకు రాదే చెలి...కళ్ళముందు నీ కులుకే మరి..
మదినిండా నీ తలపు ఝరి ..
తేల్చుకుందాం  రా మరి ..
మనకు వేదిక ఈ ప్రేమ బరి..
నువ్వూ  నేనూ కాదు అరి ..
మన జంట సరేసరి..||ఎన్నడు లేదే..||  

వద్దనకు వద్దనకే చెలి...

వద్దనకు వద్దనకే చెలి...
వద్దకు చేరే వేళ ఇది..
పొమ్మనకు పొమ్మనకే సఖి..
పొగలు కక్కే వయసిది..

సాయంత్రానా...నీ సరసకు రానా..
విరహపు వేళా.. నీ తోడును కానా..
విసిరేయకే..వలపునిలా..
విసిగించకే నువ్ రాక్షసి లా...
నీ అందం చూస్తూ ఆగేదెలా..
ఇహ అలకలు మాని రావే పిల్లా..||వద్దనకు||

ఈ జీవితమంతా..నీ దాసుని కానా..

నా మనసుకు దాహం తీర్చగ రావా...
చిరు కోపంతో నువ్ చూసే వేళా..
రేకెత్తే నాలో కోర్కెల హేల..
పంటి బిగువున...నీ చిరు పెదవి..
నలగనీయకే..నా సొత్తులవి..||వద్దనకు||

నువ్ లేనీ ఈ సమయానా..
నాకెంతో నరక యాతన..
విరహాగ్నిలో నే దహించుకుపోనా..
వాయువునై నిను స్పృశించి పోనా..

వొద్దొద్దు..అంత మాటలొద్దు..ఉండలేను...
నువ్ లేని క్షణం..నేనైనా మనగలనా..
తనువులు వేరైనా మన మనసొక్కటే..
కనులు వేరైనా కల ఒక్కటే ...
నిను చేరెందుకే నాకీ జన్మ..
చెంతకు రావోయ్ నా ముద్దుల కన్నా..

హ్హహహ్హ హ్హ...||వద్దనకు||

కుక్క పిల్లా..అగ్గిపుల్ల..సబ్బుబిళ్ళా..

నీ చిట్టి చిట్టి పాదాలు..
పారాడిన చాలు..
పరవశించు మా హృదయాలు..
చిన్ని కన్నుల కోర చూపులు..
గారాలు బోవు కూని రాగాలు...
వాలము తో వ్యవహారాలు.
ఇంత ప్రేమ చూపెడిదెవరీ పిల్లా..
ఇంకెవరమ్మా... నా కుక్క పిల్లా..

తరచి తరచి చూడ..
తనువు కట్టె..
తనువు పైన జూడ ..
మకుటమెట్టె..
తట్టి తట్టి చూడ ..
వెలుగును చూపెట్టె..
అదియొకటి గలదే..
పంచభూతములెల్ల..
వేరొకటి గాదది అగ్గిపుల్ల..

తనువు సొగసు చూడ ..
తను లేక కల్ల..
పట్టుకొను జూడ ..
పట్టుబడదే..
రవి గాంచని..కవి గాంచని..
చోటేది కానీ..
తను గాంచిన చోటల్లా..
పరిమళాలే ...
పొడుగు పొడుపులేలా..
వినుడి జనులారా..
తన పేరు వేరు గాదు సబ్బుబిళ్ళా..

చెలి నీ జత కై వేచి వున్నా...

చెలి నీ జత కై వేచి వున్నా..
నా ఆణువణువూ అర్పిస్తున్నా..
నీ మనసుని అర్ధిస్తున్నా..
నా కనులు వర్షిస్తున్నా..
నీ ప్రేమని ఆశిస్తున్నా..||చెలి నీ జత కై ||


నా గుండె ని కోస్తున్నా..
నీ క్షేమం చూస్తున్నా..
నాకెవరు లేకున్నా..
నీ తోడు చాలన్నా..||చెలి నీ జత కై ||
 

నీ ఎడబాటు వేధిస్తున్నా..
నా మది ని మధిస్తున్నా..
నీ చూపులు చేస్తోన్న
నా గాయాలని చూస్తున్నా..||చెలి నీ జత కై ||
 

నీ మనసుకి చెప్పుకున్నా..
నా మదిలో దాచుకున్నా..
నీ యద లో స్థానం కోరుకున్నా..
నా తుది లో నీకై వేడుకున్నా..||చెలి నీ జత కై ||
 

నీ రాకకై తపిస్తున్నా..
నా తనువు లో జ్వలిస్తున్న
నీ తలపులను భరిస్తున్నా..
నా వలపును వధిస్తున్నా..||చెలి నీ జత కై ||

బడుగు జీవి..

బడుగు జీవి ఇంట
బతుకు సాగేదెట్టా..
మధ్య తరగతింట
ధరల మంట.


వంట చేయులేదుటా..
కూరగాయాలట.
పాలకేడ్చు బిడ్డడట..
తల్లి కంట కన్నీరట..


లేదు పొయ్యి కింద మంట..
నూనె ధర ఆకాశాన్నంట.
బైకు తీయ భయమట..
బస్సు చూస్తె వణుకట..
 

గ్యాసు బండ నట్టింట..
రేపె ప్రజల గుండె మంట.
పండుగ పబ్బాల్లేవట..
వెలల వల్ల వెతలట..
 

ఆకలి ఆక్రందనలటా..
అరువు చేయు బాధట.
దూసుకొచ్చిన ధర చక్రాలట...
సామాన్యుడే క్షతగాత్రుడట...
 

ఆదుకునేదెవరంటా...
అసలెన్నాళ్ళీ నరకమంట.
ఎవరి వద్ద విప్పాలట..
మా బాధల చిట్టా...
ఇపుడు నేనేం చేయగలనటా..
హు .....
నాకలవాటేగా.. పస్తులుంటా....

Saturday, August 20, 2011

దూరదర్శిని

విజ్ఞానదాయినీ..వినోదప్రదాయినీ.​.
విశ్వవీక్షణీ.....విచిత్రదర్పిణ​ీ..
సర్వ భాషా భాషిణీ...
సకల జగత్ దర్శినీ..

సతత కాలక్షేపిణీ...

ప్లాస్మా...త్రీడీ..ఎల్సీడీ..
సర్వ విధ రూపిణీ...
నిత్యానంద కారిణీ ...
సత్య కాల హరణీ ..
సర్వ గృహ వాసినీ....

రేయింబవళ్ళు.. నీ సీరియళ్ళు ...
చూస్తుండ వాచెనే మా కళ్ళు..
నిను చూసి మైమరచి..
నిద్రాహారాలు విడిచి..
నీ నామమే.... తలచితినీ...

కవితా ..ఓ ...కవిత

యతి ప్రాసల మోత..
కాదు కవితంటే..
పడికట్టు పదాలు..
కాదు కవితంటే...

నీలోని భావాలకు...
నిజ రూపం కవితంటే..
అంతర్గత సంఘర్షణల..
అక్షరీకరణ కవితంటే...

పదాల విరుపు కాదది..
పడతి మేని విరుపు..
పట్టుబడితే చాలు..
పట్టు కుచ్చు ...

ఎంచుకున్న విషయాన్ని...
పంచుకున్న వేళ...
కవిత కాదది...

మనోభావ హేల....

శ్రీనివాసరెడ్డి గారికి నా ధన్యవాదాలు ...

కలం తో కాగితాన్ని దున్ని...
కవితాక్షారాలు పండించే ...
నవ యవ్వన ..
కవి కర్షకులకు ..
త్రోవ చూపటమెంతటి పుణ్యం..

నా ముద్దుబిడ్డా శ్రీనివాస రెడ్డీ..
నీ యోచన మరెంతటి అభినందనీయం..
అమ్మ భాష కమ్మదనం..
గుర్తెరిగిన నీవు..
నా ఆశీస్సులతో కలకాలం ..
వర్ధిల్లుతావు..

_ ఇట్లు మీ అమ్మ తెలుగు తల్లి..

విరుగుట.. పెరుగుట..కొరకే...

ఏం జరిగిందని ఏడుస్తున్నావ్..
ఏం మునిగిందని ముడుచుకున్నావ్ ...
కోల్పోయినదేదీ నీది కాదని తెల్సుకో...
కోర్కెల పై స్వారీ వీలు కాదు చూసుకో..

రాలిన ఆకులను చూచి.. ఏ చెట్టూ ఏడవదే...
వేసిన మేటలను చూచి.. ఏ వాగూ వగచదే..
బాధ మాని నువ్ అడుగులు వెయ్యాలి ..
నీకై అవకాశాలు పరుగులు తియ్యాలి ..

పోయిందా...పోనీయ్..

విజయానికి నిను చేరే..
శుభ ఘడియలు రాలేదు..
సహనం తో నువ్ చేసే..
కృషినెవ్వడు ఆపలేడు..

శోకించకురా శుష్కిస్తావ్..
యోచించి అడుగెయ్ సాధిస్తావ్.
విశ్రమించక శ్రమిస్తే..
విక్రమార్కుని వలె జయిస్తావ్.. .

గెలుపు నీకు కాదు రక్ష..
కావాలి అది నీ పాదరక్ష.
కోటి వరహాల చెప్పులైనా..
కాళ్ళ కిందే నలుగునే..

విజయగర్వం మానుకో...
విజయ పరంపర చేసుకో ..
విర్రవీగావా..వదులుకో..
పాతాళమే గతి..మారిపో..

జరిగినవేవీ మార్చలేవ్..
జరగబోయేవి మార్చుకో..
మెలకువతో మెళకువతో
మెండు లాభం అందుకో..

విజయోస్తు.. దిగ్విజయోస్తు..!

శిరస్త్రాణం ..

మిత్రమా..ఎందుకంత త్వరణం ...
చేరేందుకు నీ గమనం.
ఆదమరచిన ఒక్క క్షణం..
మార్చును నీ జీవన గమనం.

మరచిపోకు మిత్రమా...
నీకై తల్లిదండ్రుల నిరీక్షణం.
చేయబోకు నేస్తమా..
ప్రమాదపుటంచున ప్రయాణం.

ఆగి చూడు నువ్వు..
కనీసం ఒక తరుణం.
అతివేగం.. నిర్లక్ష్యం..
కారాదు మరణ కారణం.

కనుక...

ఎల్లప్పుడు ధరించు శిరస్త్రాణం ..
అది నిలుపును నీ ప్రాణం.
విస్మరించిన తరుణం ...
దైవమే నీకు శరణం.

తెలుగు పాటల తోరణం.

సర్వ పాప హరణం
హరి నామ స్మరణం.
సర్వ దోష హరణం
హర నామ స్మరణం...


బుద్ధి వికాస కారణం
తెనుగు మాట చలనం.
శరణం శరణం
తెలుగు తల్లి చరణం...


మనోరంజక కారణం
తెలుగు పాటల తోరణం.
స్వాగతం సుస్వాగతం
తెలుగు పాటల తోరణం.

కనపడట్లేదా...

ఏం? కనపడట్లేదా..?
ఒకటి కాదు రెండు కాదు
మూడు కళ్ళున్నాయే..
అయినా కనపడవా మా వెతలు..?
అవున్లే..ఎన్ని ఉండి ఏం లాభం..!
తమరు ధ్యానం లో ఉంటారుగా..
మా పరిస్థితి విషమిస్తున్నా పట్టించుకోవా..?
అవున్లే..నీ గొంతు నిండా విషమే కదూ..
కొంప లేక మేము ఏడుస్తుంటే..
కొంగ జపం చేస్తున్నావ్..
అవున్లే..శ్మశానం లో తిరిగేవాడికి
ఇంటి విలువ ఏం తెల్సు..?
గుక్కెడు గంజి లేక నా పిల్లలేడుస్తుంటే..
కుడుములు ఉండ్రాళ్ళు నీ పిల్లలకా..?
ఏం? మేము నీ పిల్లలం కామా..?
తలలు మార్చడం తెల్సు కానీ..
మా తల రాతలు మాత్రం మార్చలేవా?
నువ్వెలాగో ఒంటి నిండా బట్టలు కప్పుకోవ్..
మరి నా ఆడబిడ్డ కి కూడా అదే గతా?
రాళ్ళ మధ్యన కాళ్ళు పగిలి మేం చస్తుంటే..
నందులు నెమళ్ళ మీద మీ విహారమా?
విస్తట్లో మెతుకు కోసం మేం వెతికినా..
బిచ్చ గాడికి దయ మాత్రం సున్నా..
అవున్లే నీకు మాలాంటి కష్ట జీవుల కన్నా
నిన్ను మొక్కే వాళ్ళంటేనే మక్కువ.
నిన్ను వజ్ర వైడూర్యాలు ఎవడడిగాడు..?
పట్టెడన్నం పెట్టమంటే పెట్టవు.
భోళా శంకరుడిని అని చెప్పుకోవడమేనా..
మా ఘోష వినేదేమన్నా ఉందా?
నువ్వే వస్తావో నీ ఇల్లాలినే పంపుతావో..

నా ఇంటి ఆడది ఆకలి తో అలమటిస్తోంది
అది చచ్చే లోపు వచ్చి నన్ను తీస్కుపో..

Friday, August 19, 2011

జనని..

పుడమికి పురిటి నొప్పులు ...
మొలకెత్తిన విత్తనం..
శిశువు తొలి శ్వాస..


ధరణి కి ఆహ్లాదం...
వికసించిన కొమ్మలు..
శిశువు నేడు తరుణి.
 

భువి పై చిరు జల్లు ...
మురిసిన వాన..
తరుణి నేడు పడతి.
 

ఇల కు సంతసం...
మొగ్గ తొడిగిన కొమ్మ..
పడతి నేడు పుడమి.
 

పుడమికి పురిటి నొప్పులు ..
మొలకెత్తిన విత్తనం.
శిశువు తొలి శ్వాస. 




నిజమేగా.....

"చందమామ వెన్నెలనిస్తా రమ్మంది..
వద్దన్నా...
నాకు నీ నవ్వు ఉందిగా..
సాగర తీరం సేద తీరుస్తా రమ్మంది...
రానన్నా..
నాకు నీ ఒడి ఉందిగా..
పువ్వు పరిమళాన్ని ఇస్తా రమ్మంది..
పొమ్మన్నా..
నాకెందుకు..నీ కురులుండగ?
మేఘం వర్షిస్తా రమ్మంది....
వద్దన్నా...
నీ మాటల జడి ఉందిగా..
మరణం కబళిస్తానంది..
అగమన్నా...
నా సఖి లేనపుడు నేనే... వస్తానన్నా..."