Friday, September 16, 2022

మమేకం

జాలువారే జలపాతాల ఝంఝారావాలు..
ఎంత ఎత్తున ఉన్నా ఒదిగి ఉండమని చెప్తూ
నాకు జోల పాడాయి
వేకువ జామున గువ్వల సవ్వడులు..
మనసువిప్పి మాట్లాడమని
నా నిద్రాణ హృదయాన్ని తట్టిలేపాయి
తొలకరి జల్లుకు రేగిన మట్టి వాసన..
స్వచ్చంగా బ్రతకుపొమ్మని
నా అంతరాళంలో ఆనందం నింపింది
నింగిన రంగుల హరివిల్లు..
నా అందం చూడమంటూ తాండవిస్తుంటే
చిట్టి రెక్కల సీతాకోకలు..
ఆ రంగులతో పోటీ పడుతున్నాయి
కానీ తమ ఘనత ఎరుగని పూబాళలు
రంగులు మార్చుట తప్పు కదా అని అమాయకంగా చూస్తున్నాయి
తరాలు చూసిన నిండు కొండ
ఆటుపోట్లని తట్టుకొమ్మని ఆదేశమిస్తూంటే
ఏపుగా పెరిగిన పచ్చని చెట్టు
పదిమందికి సాయపడమని సందేశమిస్తోంది
గల గల పారే నదీపాయ
మార్పు నిరంతరమని బోధిస్తుంటే
అల్లంత దూరాన గర్జించిన మేఘం
అన్నింటికీ తానే ఆధారమని గర్వపడుతుంది,
అచ్చంగా నా పొగరులా.
అన్నీ చూస్తున్న ఉదయభానుడు మాత్రం
చిద్విలాసం చిందిస్తూ ప్రకృతిలో మమేకమవ్వమని నాకు గుర్తుచేస్తున్నాడు