Tuesday, September 13, 2011

లాలిపాట ......

ఆటలింక చాలు కన్నా..ఆగడాలు మాను నాన్నా..
అల్లిబిల్లి ఊసులతో..అలసిపోయే..తమరెంతో...
ఆదమరచి నిదురపోయె..వేళ కూడ దాటిపోయే...
అలసిన కిట్టయ్యకు నాన్న గుండె పానుపాయే...

తప్పటడుగులేస్తే తప్పుకాదురా చిన్నా..
తప్పుటడుగేసావో...చిన్నబోవు మీ నాన్న..
కొండంత ఎదగాలి....కోరుకుంది పొందాలి..
రాబోయే..కాలానికి రాజు నువ్వే కావాలి...
అందాకా నువ్ అన్నీ నేర్చాలి..అమ్మ గన్న కలలను నెరవేర్చాలి..||ఆటలింక||

ఇల్లు పీకి పందిరేసి.. బోసి నవ్వు రువ్వేవు..
ఉరిమి చూడ..పరుగు తీసి అమ్మ చాటు చేరేవు...
వద్దురా చిన్ని తండ్రీ ..పడుకో పద ఇంక...
పాడుకళ్ళు పడకుండా..బజ్జో నా వెనుక...
పాలబుగ్గల పసివాడా...వెన్నెలమ్మ నీ తోడా..నిదురపో నా నాన్నా నిదురపోరా...||ఆటలింక||

పసిపాదాలతో...పావనమే నా ఇల్లు...
వసివాడని నవ్వులతో..స్వర్గమిలా చాలు...
లోకం తీరు చూసావా..నరక కూపాలు...
అందుకో అమ్మకొంగు అభయహస్తాలు..
హాయిగా నిదురపో..కమ్మనైన కలలతో..ఆశిస్సులు నీకు... వర్ధిల్లు వెయ్యేళ్ళు...||ఆటలింక||

No comments:

Post a Comment