Saturday, August 20, 2011

కనపడట్లేదా...

ఏం? కనపడట్లేదా..?
ఒకటి కాదు రెండు కాదు
మూడు కళ్ళున్నాయే..
అయినా కనపడవా మా వెతలు..?
అవున్లే..ఎన్ని ఉండి ఏం లాభం..!
తమరు ధ్యానం లో ఉంటారుగా..
మా పరిస్థితి విషమిస్తున్నా పట్టించుకోవా..?
అవున్లే..నీ గొంతు నిండా విషమే కదూ..
కొంప లేక మేము ఏడుస్తుంటే..
కొంగ జపం చేస్తున్నావ్..
అవున్లే..శ్మశానం లో తిరిగేవాడికి
ఇంటి విలువ ఏం తెల్సు..?
గుక్కెడు గంజి లేక నా పిల్లలేడుస్తుంటే..
కుడుములు ఉండ్రాళ్ళు నీ పిల్లలకా..?
ఏం? మేము నీ పిల్లలం కామా..?
తలలు మార్చడం తెల్సు కానీ..
మా తల రాతలు మాత్రం మార్చలేవా?
నువ్వెలాగో ఒంటి నిండా బట్టలు కప్పుకోవ్..
మరి నా ఆడబిడ్డ కి కూడా అదే గతా?
రాళ్ళ మధ్యన కాళ్ళు పగిలి మేం చస్తుంటే..
నందులు నెమళ్ళ మీద మీ విహారమా?
విస్తట్లో మెతుకు కోసం మేం వెతికినా..
బిచ్చ గాడికి దయ మాత్రం సున్నా..
అవున్లే నీకు మాలాంటి కష్ట జీవుల కన్నా
నిన్ను మొక్కే వాళ్ళంటేనే మక్కువ.
నిన్ను వజ్ర వైడూర్యాలు ఎవడడిగాడు..?
పట్టెడన్నం పెట్టమంటే పెట్టవు.
భోళా శంకరుడిని అని చెప్పుకోవడమేనా..
మా ఘోష వినేదేమన్నా ఉందా?
నువ్వే వస్తావో నీ ఇల్లాలినే పంపుతావో..

నా ఇంటి ఆడది ఆకలి తో అలమటిస్తోంది
అది చచ్చే లోపు వచ్చి నన్ను తీస్కుపో..

No comments:

Post a Comment