Saturday, November 19, 2011

ఆడపిల్ల..

ఆడపిల్ల..

ఇది నా తప్పా...అమ్మా...నీకు నేనొద్దా నాన్నా...
నేను కూడ నీనుంచే వచ్చానే.....
నువ్ కూడ నాలాంటి ఆడదాని కొడుకువే....
అమ్మ లేనిదే జన్మ ఉన్నదా....
మరి ఆ అమ్మ కూడా ఆడదే కదా...

ఆదరించే ఆలి లేదా..ఆదుకొనే నాధుడెవడు
మగడి పొగరు మోయడానికి..మగువ లేదా..మనుగడేది..
పొత్తిళ్ళలో పసిగుడ్డును..కసిదీరా నలిపేసి
తరతరాల వారధిని..తనువు చాలింపజేసి..
కాలరాయకు నా తలరాతని...
విసిరికొట్టకు నాన్నా.. ఈ కూతురుని...||ఇది నా తప్పా..||

బిడ్డంటే బాబేనా..మనిషంటే మగడేనా...
ఆడది లేనిది ఇల్లేనా...ఆదిలక్ష్మి ఆలి పై కినుకేనా..
కంచంలో అన్నమై, బంధంలో చెల్లినై..
బతుకులోన భార్యనై..బతుకుకై అమ్మనై..
మురిపించి మరపించి తరింపజేసే
ముద్దులొలికే ముదితను...మట్టుపెడతావా... ||ఇది నా తప్పా||

వేల యణువుల మగడి ధారలో..దారి చేసుకు పరుగు తీసి
అలసిసొలసి అమ్మ కడుపులో ఆదమరచి కునుకు తీసి
అందమైన లోకంకై కమ్మనైన కలలు చూసి..
కనులుతెరిచే వేళ నను తునకలు చేస్తావా..
ఇంటికొచ్చే ఇంతిమొగ్గను తుంచివేస్తావా...
వెలుగునిచ్చే ఇంటి దీపం ఆర్పివేస్తావా...||ఇది నా తప్పా||