Sunday, August 21, 2011

జెండా పండుగ....

వచ్చిందోయ్ వచ్చింది జెండా పండుగ..
తెచ్చిందోయ్ తెచ్చింది వేడుక నిండుగ..

ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం.. నీ స్వతంత్రం...  
నేల రాలిన వేల వీరుల రక్త తిలకం.. నీ స్వతంత్రం...
అహింసనెడి ఆయుధం తో సాధించెనీ స్వతంత్రం...
ఐకమత్యమే ఆయువుగా..
ఆత్మ బలమే వాయువుగా ...
ఆత్మ గౌరవం సాక్షిగా ...
నిలచి గెలిచినదీ స్వతంత్రం... ||వచ్చిందోయ్ ||


స్వాతంత్ర్యమొచ్చి అరవైనాలుగు ఏళ్ళు ...
నేటి నేతలకు తెలుసు అన్ని కళలు..

గనులు మింగిన ఘనులు వీరు..
పనులకై పర్సెంటు కోరు..
అవినీతి సాగర చక్రవర్తులు.. 
కుంభకోణముల తీరు చూడు..
నల్ల ధనమును లెక్క చూడు
ఆగిపోవు నీ గుండె నేడు..||వచ్చిందోయ్||


స్వాతంత్ర్యమొచ్చి అరవైనాలుగు ఏళ్ళు ...
నేటి జనులకు  అన్నింట కడగళ్ళు..

పేదవాడి ఇంట గంజి కూడు లేదు...
పెద్దవాడి ఇంట బెంజి కారు..
చదువు కొనెడి నేటి పరిస్థితులు 
మారునా బడుగు జీవి గతులు..
ఓట్లకై నోట్లు పంచేరు...
చివరికి నట్టేట నిను ముంచేరు ||వచ్చిందోయ్||

స్వాతంత్ర్యమొచ్చి అరవైనాలుగు ఏళ్ళు ...
నేటికైనా నువ్ తెరువు కళ్ళు..

మంచి నేతను ఎంచి చూడు ..
సంకుచితమును విడనాడు..
కూడు పెట్టని కులాలెందుకు..
మంటపెట్టే మతాలెందుకు..
పొరుగు వారితొ పోరు ఎందుకు ..
కలసి కట్టుగ కదులు ముందుకు..||వచ్చిందోయ్||

ఇది మహాభారతం కాదు..జనభారతం..
నూరు కోట్ల ప్రజల..ఏకతా రాగం 
నవలోక నిర్మాణానికి..నాంది పలికే తరుణం..
పంద్రాగస్టు వేళ పలికెను.. ప్రతి హృదయం
వందేమాతరం  వందే..మాతరం... ||వచ్చిందోయ్||

No comments:

Post a Comment