Tuesday, August 14, 2012

స్వాతంత్య్ర దినోత్సవం అంట కదా.....

స్వాతంత్య్ర దినోత్సవం అంట కదా... సరే వెళ్ళండి.. చేస్కోండి.. పండగ చేస్కోండి....
ఐనా మనకిదేమన్నా కొత్తా..? అసలు మనకి ఉన్నంత స్వతంత్రం ఈ భుమి మీద ఇంకెక్కడుంది?
ఎన్ని నేరాలు చేసినా ..డబ్బుంటే చాలు.. దర్జాగా బయట తిరగొచ్చు...
రోడ్ల మీద ఎక్కడ పడితే... అక్కడ..పిస్స్ కొట్టొచ్చు.. ;)
చక్కగా... రిలీజ్ రోజే... సినిమాల పైరసి సీడీలను షాప్ లొ కొనుక్కొని..ఇంటిల్లపాదీ చూసెయ్యొచ్చు...
రోడ్ మీద ఎంత తప్పుకైనా.. పచ్చ నోట్లతో...పచ్చ జెండా ఊపించేస్కొచ్చు...
సంస్కృతి పాటించట్లేదన్న పేరుతో ఆడవాళ్ళను చితక్కొట్టొచ్చు...
కులం పేరుతో...రిజర్వేషన్లు పెట్టుకుని...మనలో మనమే కొట్టుకుని చావొచ్చు...
వాక్స్వా
తంత్య్రం పేరుతో...మనకిష్టమొచ్చింది వాగొచ్చు... 
దొడ్డి దారిలొ డబ్బు సంపాదించి...అడ్డంగా దొరికిపోయినా... జైలు నుంచే.. నాయకుడిగా పోటీ చేయొచ్చు...
వందల సంఖ్యలో పనికిమాలిన పన్నులు ఏడుస్తూ కడుతున్నా ..తప్పదని చెప్పి దులిపేస్కొవచ్చు..
ఓ పక్క ఆకాశం లోకి రాకెట్లు వేస్తూ...ఆ పక్కనే చేతబడి నెపం తో అమాయకుల ప్రాణాలు తియ్యొచ్చు...
కళ్ళముందు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం ..చేవ.. లేకపొయినా.. తర్వాత.. తీరిగ్గా..దాని గురించి ఫేస్ బుక్ లో వాపోవచ్చు...
జనాల్ని.. ఎన్ని సార్లు ఎదవల్ని చేసినా.. సిగ్గులేకుండా.. మళ్ళీ ఓట్లు అడుక్కోచ్చు...
చందాల పేరుతో దందాలు చెయ్యొచ్చు...
మీడియా పేరుతో...బ్లాక్ మెయిల్ చెయ్యొచ్చు..
అందుకే నాకు నా దేశం అంటే అంత గౌరవం.. అంత ప్రేమ.. ( ఎందుకుండదూ... పైన చెప్పిన వాటిలో..కొన్ని నేనూ అనుభవిస్తున్నాగా....)
పోనీలే...కనీసం ఇలా... ఏడాదికొక్కసారైనా.. జెండా ఎగరేస్తే... మన జెండా కి ఎన్ని రంగులున్నాయో... అవేంటో.. మర్చిపోకుండా ఉంటాం...
.............................................................................................................ఇట్లు
.............................................................................................................నేను..
-------------------------------------------------------------------------------------------జై హింద్..
------------------------------------------------------------------------------------------మేరా భారత్ మహాన్..

Saturday, November 19, 2011

ఆడపిల్ల..

ఆడపిల్ల..

ఇది నా తప్పా...అమ్మా...నీకు నేనొద్దా నాన్నా...
నేను కూడ నీనుంచే వచ్చానే.....
నువ్ కూడ నాలాంటి ఆడదాని కొడుకువే....
అమ్మ లేనిదే జన్మ ఉన్నదా....
మరి ఆ అమ్మ కూడా ఆడదే కదా...

ఆదరించే ఆలి లేదా..ఆదుకొనే నాధుడెవడు
మగడి పొగరు మోయడానికి..మగువ లేదా..మనుగడేది..
పొత్తిళ్ళలో పసిగుడ్డును..కసిదీరా నలిపేసి
తరతరాల వారధిని..తనువు చాలింపజేసి..
కాలరాయకు నా తలరాతని...
విసిరికొట్టకు నాన్నా.. ఈ కూతురుని...||ఇది నా తప్పా..||

బిడ్డంటే బాబేనా..మనిషంటే మగడేనా...
ఆడది లేనిది ఇల్లేనా...ఆదిలక్ష్మి ఆలి పై కినుకేనా..
కంచంలో అన్నమై, బంధంలో చెల్లినై..
బతుకులోన భార్యనై..బతుకుకై అమ్మనై..
మురిపించి మరపించి తరింపజేసే
ముద్దులొలికే ముదితను...మట్టుపెడతావా... ||ఇది నా తప్పా||

వేల యణువుల మగడి ధారలో..దారి చేసుకు పరుగు తీసి
అలసిసొలసి అమ్మ కడుపులో ఆదమరచి కునుకు తీసి
అందమైన లోకంకై కమ్మనైన కలలు చూసి..
కనులుతెరిచే వేళ నను తునకలు చేస్తావా..
ఇంటికొచ్చే ఇంతిమొగ్గను తుంచివేస్తావా...
వెలుగునిచ్చే ఇంటి దీపం ఆర్పివేస్తావా...||ఇది నా తప్పా||

Tuesday, September 20, 2011

కొత్త నానోలు......

ప్రణయం
ప్రళయం
ఒక్కటే
ఆడది

పద్మవ్యూహం
అభిమన్యుడు
ట్రాఫిక్
సామాన్యుడు

రోడ్లు
నరకానికా
స్వర్గానికా
గమ్యానికా

ఏటీయం
నాకు
నాన్న
జేబు

కిరీటం
ఉండాల్సిందే
వంకాయ
కదా...
నానోల్లో
నేను
మరీ
నానో...
భావం
మెగా
రూపం
నానో

కళాశాల
నేడు
చదువుల
కబేళా..

మార్కులు
వంద
జ్ఞానం
సున్నా

నీడపై
కోపం
నీతోనే
ఉంటుందని...

ఫేస్ బుక్
చెట్టు
కింద
నానోదయం
మామిళ్ళు
ముంజెలు
ఈతలు
వేసవి

సెలవులు
ఆటలు
ప్రయాణాలు
వేసవి

తాతయ్య
ఇచ్చిన
డబ్బులు
వేసవి

నానమ్మ
పెట్టిన
మురుకులు
వేసవి

తలంటిన
అత్తమ్మ
వాల్చూపు
మరదలు

అద్దె
సైకిల్
పగిలిన
మోచిప్ప

బావతో
పందేలు
నాన్న
మొట్టికాయలు

మేడపై
వెన్నెల్లో
అత్తమ్మ
గోరుముద్దలు....

Friday, September 16, 2011

తాళాలగుత్తి.....

సాకీ:
గల గల చప్పుడు..తళ తళ మెరుపులు..
అరచేతిలో భద్రం..భద్రత మొత్తం
ఏవిటో చెప్పు...?
.....................
ఇంకేవిటీ...తాళాలగుత్తి.....
ఇది పోయిందా...నువ్ గో....విందా.....

పల్లవి:
మేను మెరుపులతో ఆకర్షిస్తావు...
మనుషులకు నువ్ మత్తెక్కిస్తావు..
లోహ రూపమునున్న లోభివి నువ్వు..
లోకమంతటిని దాసుని కావించావు..

చరణాలు:
ప్రాణం లేని తుక్కువే..ఐనా..మా ప్రాణాలన్నీ నీవే...
వేళ గాని వేళ వేధిస్తావ్..చిక్కక...
వెతికి వెతికి చూడ..విసుగొచ్చేదాకా...
ఎంత గర్వం నాకు..
నిన్నలా వేలికి పెట్టి తిప్ప...
పట్టుజారి నా పరువు తీయకు సుమా...||మేను మెరుపులతో||

అధికార ప్రతిరూపానివే..అత్తగారి అభరణానివే...
కోడలమ్మ కోరిక పై..
కొంగులోన మురిసేదెన్నడమ్మా...
వేలెడంత లేకున్నా..వేన వేలు దాస్తావు...
గుడి కానీయ్... బడి కానియ్..విలువలేనిదెక్కడ...
దేవుడికే..నువ్ కావలి...అందుకే మాక్కూడా కావాలి... ||మేను మెరుపులతో||

ఊరంత డోరైనా..నీ సైగ ఉండాలి...
నీవు లేక మేం తెరవ తరమా...
విర్రవీగిపోకుమా..నీకంత లేదులే..మా చోర..
ఘనుల ముందు నువ్ దిగదుడుపే...
ఇదిగో చెబుతున్న...వత్తి వత్తి...
పొగరు తగ్గించుకోవే..తాళాలగుత్తీ..||మేను మెరుపులతో||

Tuesday, September 13, 2011

లాలిపాట ......

ఆటలింక చాలు కన్నా..ఆగడాలు మాను నాన్నా..
అల్లిబిల్లి ఊసులతో..అలసిపోయే..తమరెంతో...
ఆదమరచి నిదురపోయె..వేళ కూడ దాటిపోయే...
అలసిన కిట్టయ్యకు నాన్న గుండె పానుపాయే...

తప్పటడుగులేస్తే తప్పుకాదురా చిన్నా..
తప్పుటడుగేసావో...చిన్నబోవు మీ నాన్న..
కొండంత ఎదగాలి....కోరుకుంది పొందాలి..
రాబోయే..కాలానికి రాజు నువ్వే కావాలి...
అందాకా నువ్ అన్నీ నేర్చాలి..అమ్మ గన్న కలలను నెరవేర్చాలి..||ఆటలింక||

ఇల్లు పీకి పందిరేసి.. బోసి నవ్వు రువ్వేవు..
ఉరిమి చూడ..పరుగు తీసి అమ్మ చాటు చేరేవు...
వద్దురా చిన్ని తండ్రీ ..పడుకో పద ఇంక...
పాడుకళ్ళు పడకుండా..బజ్జో నా వెనుక...
పాలబుగ్గల పసివాడా...వెన్నెలమ్మ నీ తోడా..నిదురపో నా నాన్నా నిదురపోరా...||ఆటలింక||

పసిపాదాలతో...పావనమే నా ఇల్లు...
వసివాడని నవ్వులతో..స్వర్గమిలా చాలు...
లోకం తీరు చూసావా..నరక కూపాలు...
అందుకో అమ్మకొంగు అభయహస్తాలు..
హాయిగా నిదురపో..కమ్మనైన కలలతో..ఆశిస్సులు నీకు... వర్ధిల్లు వెయ్యేళ్ళు...||ఆటలింక||

Monday, September 12, 2011

ప్రేమ లేని ప్రేమగీతం ......

సాకీ:
నీ అడుగుల సడి వినగానే నా..గుండె సవ్వడి...హెచ్చింది ..
నీ తలపు రాగానే..మది తలుపు తెరుచుకుంది..
ఓ మగువా..నా..మనసు మాటలు వినవా.....

పల్లవి:
వేయి జన్మలైనా..వేచి చూస్తా ప్రియా..
వేలందుకుని నడిపించగా నడిచొస్తా...సఖీ..
విధినైనా..విదిలిస్తా.. నిను చేరే దారిలో..
వేరు కాదు మనం జన్మ జన్మలలో ......

చరణాలు:
అనంతమైన అందమా..అందుకోమ్మా..
అంతులేని ఆరాటమా..నా అంతరంగమా..
అర్ధం చేసుకోమ్మా...ఆదరించుమా..
ఆవిరైన మాటల్లొ..అంతరార్ధమా..
ఆశలన్ని మూటగట్టి..ఆడుకోకుమా...
ఇదేమిటమ్మా..నీ మహిమా,..నాకు నేనే చిక్కనమ్మా.. ||వేయి జన్మలైనా||

నువ్వే నువ్వే నా..మది గెలిచావే...
నీ తలపుల జడిలో నను తడిపావే..
నా గుండె గుడిలో...అడుగేయవే..
కడదాకా..కలసి నీతో.. సాగనీయవే...
ఒక్కసారి ఊ కొట్టు..
నిను చేరాలని చెలరేగే నా మనసుని.. నీ చేత్తో...జోకొట్టు...||వేయి జన్మలైనా||

ఆకాశమంతటి మనుసు నాదిలే..
అందులోన నీ రూపు హరివిల్లు కాదులె..
ఆద్యంతం నీవే.. నా ఉదయ భానువే...
నా హృదయరాణివే..విరించి వరానివే...
వరించి నిలుపుకోవే..నా ప్రాణము నీవే...
చలించి..చూడు చెలీ వడివడి.....నా..యదలో ఈ అలజడి... ||వేయి జన్మలైనా||

నువ్ ఔనంటే చాలు ఆనందభాష్పాలు..
కాదంటె కొమ్మ..కన్నీటి వరదలు..
కళ్ళలోన కొలువున్నీ వదనం చూడు..
కాటికేగు నేను..కాదను నేడు..
కాలదోషమేది.. కపటిని కాను..
కావ్యమంటి నిన్ను....కంటి పాపలా..కాచుకొందును...||వేయి జన్మలైనా||

Sunday, September 11, 2011

నానోలు......

విజయం
మజిలీ
ఆపకు
ప్రయాణం

సిగరెట్
మద్యం
ఫేస్ బుక్
వ్యసనాలు

అన్నీ
విను
నచ్చింది
చెయ్

పుష్పకవిమానం
కాలేజిలో
నా
బైక్

ప్రతి
రోజు
హాజరు
థియేటర్లో
 
మనసు
చెడ్డది
మాట
వినదు

కన్నీటికి
టిష్యూ
పేపర్
కాలం

అగ్ని
కంటే
పవిత్రం
సీతమ్మ

గ్రౌండ్లో..
ఎదురీత..
ఇంగ్లాండ్లో
టీమిండియా

స్వరం
వరం
ఘనం
బాలు..