Monday, April 20, 2020

ఓ..దొరా మమ్ము సంపకురో...


కూడు లేదు..గుడ్డ లేదు..
బతికేందుకు దమ్ము లేదు
దొరా మమ్ము సంపకురో

మా గరీబోళ్ళ కడుపు కొట్టి
గంజి తాపి పండవెట్టి
దొరా మమ్ము సంపకురో

కూలి లేదు నాలి లేదు
అమ్మేందుకు పుస్తె లేదు .
ఐనగానీ..
కిస్తి కట్టమందువా .
దొరా మమ్ము సంపకురో..

సదువు లేదు.. సంజె లేదు
నీకు సాటిరాము.. సత్తులేదు
దొరా మమ్ము సంపకురో

బువ్వలేదు జావలేదు ..
గుక్కెడైన నీరు లేదు..
ఐనగానీ..
నీ ఈత కొలను తాకలేము..
దొరా మమ్ము సంపకురో

గుడిసె కాదు తడిక కాదు..
గూడున బతికేస్తున్నం..
గుట్టుగా బతికేస్తున్నం..
ఐనగానీ...
నీ బంగళా మాకొద్దురో..
దొరా మమ్ము సంపకురో..

నీ ఇంటి బయిట..నీ ఇంటి బయిట..
నీ ఇంటి బయిట దిష్టి బొమ్మలమనుకోరా...
ఓ..దొరా మమ్ము సంపకురో.

దహనం


ఏమిటీ చీకట్లు...
ఎక్కడా వెలుగు కానరాదె....
కన్ను పొడుచుకున్నా కనపడదె..
ఐనా...
ఎక్కడిదీ అంధకారం...ఆరు బైటనే ఉన్నానే..
ఎవరక్కడ...
ఏమిటా చప్పుడు..
ఎవరు మీరంతా...
ఎందుకు .. ఎందుకు నన్ను నెట్టేస్తున్నారు..
ఏం? నాకేం భయమనుకున్నారా...
మీరు నన్ను చంపలేరు..
మీరు నన్ను ఎంత రగిల్చి వేసినా..
ఎంత క్షోభ పెట్టినా..
నేను చావను.
ఈర్ష్యా అసూయ ద్వేషాలైన మీరు
నన్ను ఎప్పుడో కబళించేసారు..
ఇంకా కొత్తగా చంపేదేముంది గనక..
కాల్చండి ..నన్ను నిలువునా తగులబెట్టండి..
రావణ కాష్టం లా రగులుతా..
సజీవంగా పాతిపెట్టండి..
విత్తనమై మొలకెత్తుతా..
ఐనా...
ఇప్పుడు కాదు.. నాడు ..ఆనాడు..
మీరు నన్ను ఆవహిస్తున్న నాడు..
నేనాపలేదే...మరి నేడాపగలనా...
రండి..దహించండి..
నా హాహాకారాలతో ..మీ ప్రతీకారం తీర్చుకోండి...

జరా... కమ్ ' కరోనా' ..


అణువంత లేవుగాని అల్లాడిస్తున్నావు
వినువీధుల విర్రవీగి విశ్వమంతా వ్యాపించావు
ఆక్రందనలు ఆర్తనాదాలు ఆస్వాదిస్తున్నావు
ఆదమరచి ఉన్నవాణ్ణి అంతం చేస్తున్నావు..

రాజులేదు పేద లేదు
కులమతాల ప్రసక్తి లేదు
జాలిలేదు దయ లేదు
జనుల పై పగ తీర లేదు

ఆటకట్టు వేళ ఆసన్నమౌతుంది
ఆగడాలు చాలు ఆలస్యమవుతుంది
అయినా...
బెదరబోము చెదర బోము
పట్టునసలే వదలబోము

'విడి' 'విడి' గా కలివిడిగా అడుగులేస్తూ వస్తున్నాం
అలజడి రేగిన గుండెల గాయాలు మోస్తున్నాం
అలసిన మనసు కు ఆశలు చిగురింపజేయిస్తాం
సాంకేతిక శస్త్రాల తో విజయ బాట వేస్తున్నాం

ఏది ఏది అని అడగవద్దు చేస్తాం ఏదైనా..
ఎక్కడెక్కడ ని వెతకవద్దు వస్తాం ఎంతైనా..
ఎవరెవర ని వెరవ వద్దు నిను విరవగ రాలేనా..
ఎపుడెపుడని శంక వద్దు జాగు చేయగలనా..
అంతదాకా..
జరా... కమ్ ' కరోనా' ..

అందని అక్షరాలు..


ఊహలకు అక్షరాలు అద్దుదామంటే..
అందకుండా అటలాడుతున్నాయి..
దారం తెగిన గాలిపటం లా..
గాలికెగిరే ఎండుటాకులా
మాట వినక మారాం చేస్తున్నాయి..

తీపికలల కబుర్లు చెబుతానని ఆశ పెట్టాను
ఉన్నచోటే ఉండమని బతిమాలాను..
కానీ..
మదిలో గూడు కట్టిన బాధను చూసి రానన్నాయి..
కదిలిన పట్టు లోని తేనెటీగల్లా చెల్లాచెదురు అయిపోయాయి..
అరె.. కన్నీళ్ళతో మీకేం సంబంధం..
మాటిస్తున్నా.. నా మనసు తడి మీకంటనివ్వను..

ఎంత అత్యాశ మీకు .. ఎపుడూ సుఖాలే కావాలే..
తీరం తో అలలు లాగా నాతో ఎందుకీ దోబూచులాట.
అయినా.. ఎంతకాలం ఈ వెతుకులాట.

అదుగో..
ఆలస్యమవుతుంది..
ఊహనైనా అందంగా ఉండనివ్వరా..

ఎన్ని సార్లు నా ఆనందాన్ని పంచుకున్నారు..
చిలిపి ఊసులు .. చిత్రమైన కథలూ..
మరి ..
ఇప్పుడేమైంది..

నిష్టూరాలు.. నిట్టూర్పులు ఏవీ లేవు..
నిజాలు మీకక్కరలేదుగా..
తోడురాని అక్షరం తోడేలు తో సమానం..
మరీ ఇంత ద్రోహమా..

రండి..కలసికట్టుగా రండి..
అబద్ధమైనా ఆలకించండి .
అలసిన మనసును ఆదరించండి..
అక్షర పానుపు పై అంతిమ నిద్రకు అనుమతించండి..

పునరుజ్జీవం

ఆగిపోయింది అనుకున్న కలం..
 కొత్త ఊపిరి పోసుకుని కేరింతలు కొడుతుంది..
ఎనిమిదేళ్ళ ఎడబాటుని ఎడం చేద్దామనుకుంటుంది
చూద్దాం ఈ మురిపెం ఎన్నాళ్ళో...
గజిబిజి బ్రతుకుల రణగొణ ధ్వనుల మధ్య ఎంత కాలం మనగలుగుతుందో..
ఐనా నా పిచ్చిగానీ.. ఇంత జీవితం మాత్రం ఏం నేర్పిందని..
అదే అసహనం అదే నిర్లక్ష్యం..
అంతర్వాహిని ఎన్నో చెప్పాలనుకున్నా..చెప్పనిచ్చే సమయమిచ్చానా ..
లేదు.
ఇక మన్నించే ఓపిక లేక..
కలం నన్ను పూర్తిగా కాదనుకునే లోపే కళ్ళు తెరవాలనే..
ఈ చిన్న మరు ప్రయత్నం ..

Tuesday, August 14, 2012

స్వాతంత్య్ర దినోత్సవం అంట కదా.....

స్వాతంత్య్ర దినోత్సవం అంట కదా... సరే వెళ్ళండి.. చేస్కోండి.. పండగ చేస్కోండి....
ఐనా మనకిదేమన్నా కొత్తా..? అసలు మనకి ఉన్నంత స్వతంత్రం ఈ భుమి మీద ఇంకెక్కడుంది?
ఎన్ని నేరాలు చేసినా ..డబ్బుంటే చాలు.. దర్జాగా బయట తిరగొచ్చు...
రోడ్ల మీద ఎక్కడ పడితే... అక్కడ..పిస్స్ కొట్టొచ్చు.. ;)
చక్కగా... రిలీజ్ రోజే... సినిమాల పైరసి సీడీలను షాప్ లొ కొనుక్కొని..ఇంటిల్లపాదీ చూసెయ్యొచ్చు...
రోడ్ మీద ఎంత తప్పుకైనా.. పచ్చ నోట్లతో...పచ్చ జెండా ఊపించేస్కొచ్చు...
సంస్కృతి పాటించట్లేదన్న పేరుతో ఆడవాళ్ళను చితక్కొట్టొచ్చు...
కులం పేరుతో...రిజర్వేషన్లు పెట్టుకుని...మనలో మనమే కొట్టుకుని చావొచ్చు...
వాక్స్వా
తంత్య్రం పేరుతో...మనకిష్టమొచ్చింది వాగొచ్చు... 
దొడ్డి దారిలొ డబ్బు సంపాదించి...అడ్డంగా దొరికిపోయినా... జైలు నుంచే.. నాయకుడిగా పోటీ చేయొచ్చు...
వందల సంఖ్యలో పనికిమాలిన పన్నులు ఏడుస్తూ కడుతున్నా ..తప్పదని చెప్పి దులిపేస్కొవచ్చు..
ఓ పక్క ఆకాశం లోకి రాకెట్లు వేస్తూ...ఆ పక్కనే చేతబడి నెపం తో అమాయకుల ప్రాణాలు తియ్యొచ్చు...
కళ్ళముందు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం ..చేవ.. లేకపొయినా.. తర్వాత.. తీరిగ్గా..దాని గురించి ఫేస్ బుక్ లో వాపోవచ్చు...
జనాల్ని.. ఎన్ని సార్లు ఎదవల్ని చేసినా.. సిగ్గులేకుండా.. మళ్ళీ ఓట్లు అడుక్కోచ్చు...
చందాల పేరుతో దందాలు చెయ్యొచ్చు...
మీడియా పేరుతో...బ్లాక్ మెయిల్ చెయ్యొచ్చు..
అందుకే నాకు నా దేశం అంటే అంత గౌరవం.. అంత ప్రేమ.. ( ఎందుకుండదూ... పైన చెప్పిన వాటిలో..కొన్ని నేనూ అనుభవిస్తున్నాగా....)
పోనీలే...కనీసం ఇలా... ఏడాదికొక్కసారైనా.. జెండా ఎగరేస్తే... మన జెండా కి ఎన్ని రంగులున్నాయో... అవేంటో.. మర్చిపోకుండా ఉంటాం...
.............................................................................................................ఇట్లు
.............................................................................................................నేను..
-------------------------------------------------------------------------------------------జై హింద్..
------------------------------------------------------------------------------------------మేరా భారత్ మహాన్..

Saturday, November 19, 2011

ఆడపిల్ల..

ఆడపిల్ల..

ఇది నా తప్పా...అమ్మా...నీకు నేనొద్దా నాన్నా...
నేను కూడ నీనుంచే వచ్చానే.....
నువ్ కూడ నాలాంటి ఆడదాని కొడుకువే....
అమ్మ లేనిదే జన్మ ఉన్నదా....
మరి ఆ అమ్మ కూడా ఆడదే కదా...

ఆదరించే ఆలి లేదా..ఆదుకొనే నాధుడెవడు
మగడి పొగరు మోయడానికి..మగువ లేదా..మనుగడేది..
పొత్తిళ్ళలో పసిగుడ్డును..కసిదీరా నలిపేసి
తరతరాల వారధిని..తనువు చాలింపజేసి..
కాలరాయకు నా తలరాతని...
విసిరికొట్టకు నాన్నా.. ఈ కూతురుని...||ఇది నా తప్పా..||

బిడ్డంటే బాబేనా..మనిషంటే మగడేనా...
ఆడది లేనిది ఇల్లేనా...ఆదిలక్ష్మి ఆలి పై కినుకేనా..
కంచంలో అన్నమై, బంధంలో చెల్లినై..
బతుకులోన భార్యనై..బతుకుకై అమ్మనై..
మురిపించి మరపించి తరింపజేసే
ముద్దులొలికే ముదితను...మట్టుపెడతావా... ||ఇది నా తప్పా||

వేల యణువుల మగడి ధారలో..దారి చేసుకు పరుగు తీసి
అలసిసొలసి అమ్మ కడుపులో ఆదమరచి కునుకు తీసి
అందమైన లోకంకై కమ్మనైన కలలు చూసి..
కనులుతెరిచే వేళ నను తునకలు చేస్తావా..
ఇంటికొచ్చే ఇంతిమొగ్గను తుంచివేస్తావా...
వెలుగునిచ్చే ఇంటి దీపం ఆర్పివేస్తావా...||ఇది నా తప్పా||