Monday, April 20, 2020

అందని అక్షరాలు..


ఊహలకు అక్షరాలు అద్దుదామంటే..
అందకుండా అటలాడుతున్నాయి..
దారం తెగిన గాలిపటం లా..
గాలికెగిరే ఎండుటాకులా
మాట వినక మారాం చేస్తున్నాయి..

తీపికలల కబుర్లు చెబుతానని ఆశ పెట్టాను
ఉన్నచోటే ఉండమని బతిమాలాను..
కానీ..
మదిలో గూడు కట్టిన బాధను చూసి రానన్నాయి..
కదిలిన పట్టు లోని తేనెటీగల్లా చెల్లాచెదురు అయిపోయాయి..
అరె.. కన్నీళ్ళతో మీకేం సంబంధం..
మాటిస్తున్నా.. నా మనసు తడి మీకంటనివ్వను..

ఎంత అత్యాశ మీకు .. ఎపుడూ సుఖాలే కావాలే..
తీరం తో అలలు లాగా నాతో ఎందుకీ దోబూచులాట.
అయినా.. ఎంతకాలం ఈ వెతుకులాట.

అదుగో..
ఆలస్యమవుతుంది..
ఊహనైనా అందంగా ఉండనివ్వరా..

ఎన్ని సార్లు నా ఆనందాన్ని పంచుకున్నారు..
చిలిపి ఊసులు .. చిత్రమైన కథలూ..
మరి ..
ఇప్పుడేమైంది..

నిష్టూరాలు.. నిట్టూర్పులు ఏవీ లేవు..
నిజాలు మీకక్కరలేదుగా..
తోడురాని అక్షరం తోడేలు తో సమానం..
మరీ ఇంత ద్రోహమా..

రండి..కలసికట్టుగా రండి..
అబద్ధమైనా ఆలకించండి .
అలసిన మనసును ఆదరించండి..
అక్షర పానుపు పై అంతిమ నిద్రకు అనుమతించండి..

No comments:

Post a Comment