Monday, May 11, 2020

నా ప్రపంచం...

నిశి వేళ నిద్రిస్తున్న లోకమంటే ఇష్టం నాకు
నన్ను నాలోకి లాక్కొని పోయే వీలుంటుందని.
నిశ్శబ్ద తరంగాలు నా అంతరంగాన్ని ఆవిష్కరింపజేస్తాయి
చిక్కటి చీకటి రంగు నా రంగుల ప్రపంచానికి వెలుగునిస్తోంది.

కలలు కనే వేళ కళ్ళ ముందే నా కలలన్నీ కలం లోంచి కాలం లోకి జారవిడుస్తుంటే ఎంత బావుంటుందో కదా..
కానీ మూడో కన్ను నన్ను చూస్తుంటే ఎందుకో ఏదో తెలియని గుబులు..
ముట్టుకుంటే ముడుచుకు పోయే ఆకు మొక్కని నేను
ముళ్లుంటాయి కానీ, ముచ్చటగానే ఉంటుంది నాతో ఆట.

నలుగురిలో నడవాలంటే ధైర్యం ఉండాలట ...
అసలెందుకు నడవాలి నేను .. అక్షరాల ఆకాశంలో మబ్బునై విహరిస్తుంటే..
అయినా .. ఇంత నిజమైన నికృష్టపు లోకంలో కూడా ఒక అందమైన ఆనందం ఏంటో తెలుసా..
కళ్ళు మూసుకుంటే కనపడే చీకటి. కావల్సినంత తోడుకోవచ్చు ..
రాతికి కట్టబడ్డది  పైకెగరలేదని నిష్టూరాలెందుకు..
ఎగిరే అవకాశమిచ్చి చూడు.. అంతరిక్షాన్ని అధిగమిస్తుంది.

నేనెప్పుడూ ఒంటరి కాదు.. నాతో నేనున్నా కదూ..
అమృతమైన 'విష' విషయమే ఈ ఏకాంతం...
మదిలో మెదిలే ప్రతీది చేసేద్దామనే బలం .. బంధమనే కసాయికి తలొగ్గి కలం ముందు వాపోతోంది.

అయినా జీవితం లో బంధాలు బాధ్యతలు లేనిదెవరికీ..
మరి నేనెందుకిలా..
ఎందుకంటే, తలపుల రథానికి అక్షరాశ్వాలను కట్టి, విశ్వం లో విహరించాలనే విపరీతపు వింత జీవిని మరి.
సమూహం లో ఒక్కడిని కాను.. నేనే సమూహం. 

అనంతమైన జగతికి ఆద్యంతాలు అక్షరాలే.. అవి పేర్చుకు పోతే సరిపోదూ.. పనిగట్టుకు పడికట్టులెందుకూ...
శశి వెలసిన సమయాన వసివాడని  మది పలుకులు నట్టింట నడయాడగా ..  మధువులూర మేఘం గర్జించె.

అదుగో ... గంటలు మృోగుతున్నాయి..
భానోదయమైపోతోంది..
చెదరిన అక్షరాలను మనసున మూటగట్టే వేళయింది..
మెలకువ మాటున నిద్ర నటించే సమయమిది..
విచ్చలవిడి తలపులను వెలివేసే తరుణమిది..
విను వీధుల విహారాలు విడిచి .. వికృతపు నిజం లోకి విసిరివేయబడే క్షణమిది..

కళ్ళు తెరిచే ముందు .. తప్పక తిరిగొస్తానని నాలోని సమూహానికి మాటిచ్చాను ..
మరోసారి కళ్ళు మూస్తానని ఆశతో కళ్ళు తెరుస్తున్నాను.

No comments:

Post a Comment