Friday, September 16, 2022

మమేకం

జాలువారే జలపాతాల ఝంఝారావాలు..
ఎంత ఎత్తున ఉన్నా ఒదిగి ఉండమని చెప్తూ
నాకు జోల పాడాయి
వేకువ జామున గువ్వల సవ్వడులు..
మనసువిప్పి మాట్లాడమని
నా నిద్రాణ హృదయాన్ని తట్టిలేపాయి
తొలకరి జల్లుకు రేగిన మట్టి వాసన..
స్వచ్చంగా బ్రతకుపొమ్మని
నా అంతరాళంలో ఆనందం నింపింది
నింగిన రంగుల హరివిల్లు..
నా అందం చూడమంటూ తాండవిస్తుంటే
చిట్టి రెక్కల సీతాకోకలు..
ఆ రంగులతో పోటీ పడుతున్నాయి
కానీ తమ ఘనత ఎరుగని పూబాళలు
రంగులు మార్చుట తప్పు కదా అని అమాయకంగా చూస్తున్నాయి
తరాలు చూసిన నిండు కొండ
ఆటుపోట్లని తట్టుకొమ్మని ఆదేశమిస్తూంటే
ఏపుగా పెరిగిన పచ్చని చెట్టు
పదిమందికి సాయపడమని సందేశమిస్తోంది
గల గల పారే నదీపాయ
మార్పు నిరంతరమని బోధిస్తుంటే
అల్లంత దూరాన గర్జించిన మేఘం
అన్నింటికీ తానే ఆధారమని గర్వపడుతుంది,
అచ్చంగా నా పొగరులా.
అన్నీ చూస్తున్న ఉదయభానుడు మాత్రం
చిద్విలాసం చిందిస్తూ ప్రకృతిలో మమేకమవ్వమని నాకు గుర్తుచేస్తున్నాడు 

Monday, May 11, 2020

నా ప్రపంచం...

నిశి వేళ నిద్రిస్తున్న లోకమంటే ఇష్టం నాకు
నన్ను నాలోకి లాక్కొని పోయే వీలుంటుందని.
నిశ్శబ్ద తరంగాలు నా అంతరంగాన్ని ఆవిష్కరింపజేస్తాయి
చిక్కటి చీకటి రంగు నా రంగుల ప్రపంచానికి వెలుగునిస్తోంది.

కలలు కనే వేళ కళ్ళ ముందే నా కలలన్నీ కలం లోంచి కాలం లోకి జారవిడుస్తుంటే ఎంత బావుంటుందో కదా..
కానీ మూడో కన్ను నన్ను చూస్తుంటే ఎందుకో ఏదో తెలియని గుబులు..
ముట్టుకుంటే ముడుచుకు పోయే ఆకు మొక్కని నేను
ముళ్లుంటాయి కానీ, ముచ్చటగానే ఉంటుంది నాతో ఆట.

నలుగురిలో నడవాలంటే ధైర్యం ఉండాలట ...
అసలెందుకు నడవాలి నేను .. అక్షరాల ఆకాశంలో మబ్బునై విహరిస్తుంటే..
అయినా .. ఇంత నిజమైన నికృష్టపు లోకంలో కూడా ఒక అందమైన ఆనందం ఏంటో తెలుసా..
కళ్ళు మూసుకుంటే కనపడే చీకటి. కావల్సినంత తోడుకోవచ్చు ..
రాతికి కట్టబడ్డది  పైకెగరలేదని నిష్టూరాలెందుకు..
ఎగిరే అవకాశమిచ్చి చూడు.. అంతరిక్షాన్ని అధిగమిస్తుంది.

నేనెప్పుడూ ఒంటరి కాదు.. నాతో నేనున్నా కదూ..
అమృతమైన 'విష' విషయమే ఈ ఏకాంతం...
మదిలో మెదిలే ప్రతీది చేసేద్దామనే బలం .. బంధమనే కసాయికి తలొగ్గి కలం ముందు వాపోతోంది.

అయినా జీవితం లో బంధాలు బాధ్యతలు లేనిదెవరికీ..
మరి నేనెందుకిలా..
ఎందుకంటే, తలపుల రథానికి అక్షరాశ్వాలను కట్టి, విశ్వం లో విహరించాలనే విపరీతపు వింత జీవిని మరి.
సమూహం లో ఒక్కడిని కాను.. నేనే సమూహం. 

అనంతమైన జగతికి ఆద్యంతాలు అక్షరాలే.. అవి పేర్చుకు పోతే సరిపోదూ.. పనిగట్టుకు పడికట్టులెందుకూ...
శశి వెలసిన సమయాన వసివాడని  మది పలుకులు నట్టింట నడయాడగా ..  మధువులూర మేఘం గర్జించె.

అదుగో ... గంటలు మృోగుతున్నాయి..
భానోదయమైపోతోంది..
చెదరిన అక్షరాలను మనసున మూటగట్టే వేళయింది..
మెలకువ మాటున నిద్ర నటించే సమయమిది..
విచ్చలవిడి తలపులను వెలివేసే తరుణమిది..
విను వీధుల విహారాలు విడిచి .. వికృతపు నిజం లోకి విసిరివేయబడే క్షణమిది..

కళ్ళు తెరిచే ముందు .. తప్పక తిరిగొస్తానని నాలోని సమూహానికి మాటిచ్చాను ..
మరోసారి కళ్ళు మూస్తానని ఆశతో కళ్ళు తెరుస్తున్నాను.

Thursday, April 30, 2020

శుభాకాంక్షలు

వేయిజన్మల బంధాన్ని 
వేలి కొనలతో ముడివేసి ..
మనసా వాచా కర్మణా
సప్తపది లో అడుగేసి..
నూరేళ్ళ ప్రయాణానికి
జత మనసులతో పునాదులేసి
ఆనందపు గగనాన...
ఆశల పల్లకిలో విహరిస్తూ..
అచ్చెరువొందే గమనాన్ని ఆస్వాదిస్తూ..
తొలి మజిలీ చేరుకున్న ఈ శుభవేళ..
అష్టైశ్వర్యాలు మీకు చేకూరాలని దీవిస్తూ..

ఇవే మా శుభాకాంక్షలు..

Monday, April 20, 2020

నానోలు

అనుమానం
మేకు
అనుబంధం
బ్రేకు...


ఎలక్ట్రానిక్
వల
మాయాజాలం
అంతర్జాలం


అద్దె
ఇల్లు
దేహం
ఆత్మకు


ఆలస్యం
అమృతం
విషం
శుభరాత్రి..


కోపమా..
బుసలు
కొడుతుంది
వాలుజడ....


కోపం
దుఃఖ్ఖానికి
దగ్గర
దారి...

రమ్మని.. ఈ చావులేఖనే..(పేరడీ)

అ: రాయి,..
ఆ: ఏమి రాయలి..
అ: డెట్టాల్..
ఆ: దేనికి..
అ: చేతులకి..
ఆ; చేతులకా..
అ: నేనిపుడె రాస్కున్నాను.. నువ్ కూడా రాస్కుంటే ..
ఆ; వెయిట్..వెయిట్..నేను చేతులకి రాస్కుని..
అ: ఇల్లు కూడా తుడిచేసేయ్..
ఆ; హహహ్హహ్హా.. ఐ లైకిట్..లైకిట్..

కరోనా నీకిది న్యాయమా .. మాకిది శాపమే
రమ్మని ఈ చావులేఖనే రాసింది తమరులే..
కరోనా నీకిది న్యాయమా .. మాకిది శాపమే
ప్రాణాలతో ఆటలే..ఆరుబయలు లో..
పీడ కలల వెతలులే నిదుర వేళలో..
ఓహో..రమ్మని ఈ చావులేఖనే రాసింది తమరులే..
కరోనా నీకిది న్యాయమా .. మాకిది శాపమే..

ఇళ్ళల్లో శుభ్రమేదో మొత్తంగ పెరిగిపోయే ..
మాయ చేసే ఆ మాయే నీదాయే..
ఎంత శుభ్రమైన గాని నా మేనికేమిగాదు.
స్ప్రేలు సోకి నీ ప్రాణం పోయేనే..
వెలికి రాని వెర్రి వైరస్ ప్రతి చోటులోన దాగివున్నదీ..
దాన్ని నేను ఆపలేక డెట్టాలు కొడితే చస్తు వున్నదీ..
పురుగులన్ని వేరు మామూలు పురుగు కాదు...అణువు కంటే చిన్ననైనదీ..
టీకాలనే కనుగొని చూపుతాం నీ అంతు కరోనా..
బుద్ధిగా ఆటలాపి హద్దులోన నువ్వు నిలువుమా..
గో కరోనా గో..గో..గో కరోనా గొ...
టీకాలనే కనుగొని చూపుతాం నీ అంతు కరోనా..

క..ఖ..గ..ఘ...


కనికరించు కాలమా
ఖదిర దరి చేర్చుమా
గమనం లో
ఘాతమా..

చరిత లోన నిలుపుమా
ఛత్రమై నిలువుమా
జలతారు జాలమా
ఝరి లాగ సాగుమా

టక్కరివైపోకుమా
ఠక్కుర నీవే సుమా..

డప్పుల చప్పుళ్లతో
ఢమ ఢమ నాదాల తో
తప్పెట్ల తాళాలతో
దద్దరిల్లు మోతలతో..

ధరణి చేరు నేడు
నర రూప కౌముది

పలుమార్లు యత్నించి ..
ఫలమొందు శ్రమించి..
బరి లోన నిను తలచి

భగవానుని ప్రార్థించి
మగువా నిను గెలవనా

యవనిక ను ఛేదించి
రజత హారము తెచ్చి
లఘు గడియ నైనా
వదలగలనా..

శశకము వలె పరుగిడినా
షరతులెన్నో కలబడినా
సహన శీలుడనై
హలధరుండనై
క్షమిత గాని నిన్నువరించు నేను
ఱక్కుల సాక్షిగా...

అ.. ఆ.. ఇ.. ఈ...


అరవిరిసిన అందమా
ఆదరించు నేస్తమా
ఇల చేరిన చంద్రమా
ఈడు గోడు వినుమా

ఉన్నదొక్క ప్రాణమా
ఊసులాడ చేరుమా
ఋక్థ నాయకి నీవుమా
ఋూక లేమి నా నేరమా

ఎడ తెగని దూరమా
ఏల జాగు జాలమా
ఐశ్వర్య రూపమా

ఒక్కసారి నవ్వుమా
ఓరకంట చూడుమా
ఔరాయనిపించు ..

అందమా..
అంతఃపుర గంధమా..